చందమామ


Cover Image for చందమామ

అది వెస్ట్రన్ సిడ్నీ ...

"హేయ్ సిరీ హ్యాపీ బర్త్ డే నాన్నా. "

"థాంక్ యూ అమ్మా నాన్నా"

"నువ్వు మాకు పుట్టి 20ఏళ్ళు అయిన సందర్బంగా నీకు 20 గిఫ్ట్స్ ఇదుగో "

"ఎందుకు డాడీ ఇవన్నీ"

"నీ కంటే ఎక్కువా, గుడ్ నైట్ తల్లీ "


సాయంత్రం ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి

చూస్తుంటే 8 ఏళ్ళ కింద జరిగిన నా బర్త్ డే సంఘటన గుర్తొచ్చింది.


అప్పుడు నా వయసు 12 ఏళ్ళు.


"అమ్మా సిరీ, లేవమ్మా. ఈరోజు నీ పుట్టిన రోజు. నీకోసం చాలా మంది ఫ్రెండ్స్ మనింటికి వస్తారు. చాలా గిఫ్ట్స్, సర్ప్రైజ్ లువస్తాయి. త్వరగా లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి, లే "


నాకు రెండు సంవత్సరాల నుండీ అడుగుతున్న సైకిల్ ఈసారైనా నాన్న కొనిస్తారేమో అని ఎదురు చూసా, మళ్ళీ నో చెప్పారు. కనీసం ఆ వీడియో గేమ్ అయినా కొనివ్వట్లేదు అసలు ఏంటి ఈ పేరెంట్స్ అన్నిటికి నో చెప్తారు అనుకునేదాన్ని.


"స్కూల్ లో ఫ్రెండ్స్ తో ఎక్కువ గడిపితే తప్పే, ఇష్టమొచ్చిన సినిమాలు చూస్తే తప్పే, నాకిష్టమొచ్చినట్టు డ్రెస్ , జుట్టు వేసుకుంటేతప్పే , అబ్బాయిలతో మాట్లాడితే తప్పే. ఇలాంటి పేరెంట్స్ అందరికి ఉంటే ఎంత చిరాకు అసలు"


సాయంత్రం బర్త్ డే పార్టీ అయ్యాక గిఫ్ట్స్ అన్నీ ఆశగా ఓపెన్ చేసి చూస్తే అన్నీ అవే పాత బోడి గిఫ్ట్స్. బుక్స్ పెన్నులు బొమ్మలుపజిల్స్ ....

ఆ మూలన ఏదో సన్నటి పొడవాటి గిఫ్ట్ బాక్స్ ఉంటే ఓపెన్ చేశా. పొడుగ్గా రంగు రంగుల్లో ఉన్న గాజు కర్ర కి చివరన ఒక గోళాకారంలో ఉన్న చందమామ లాంటి ది అతుక్కుని ఉంది. ఏదో మేజిక్ స్టిక్ లాగా.


ఆ రెయిన్బో గ్లాస్ స్టిక్ మీద ఏదో చిన్నగా రాసి ఉంది.

"ఈ చందమామ ని మీ అర చేతిలో పెట్టుకుని మీరు కోరుకుంది మనసులో అనుకుని చందమామా అని అనుకుంటే , అప్పటికప్పుడు జరిగి పోతుంది. ఈ రంగులన్నీ కరిగిపోయి ఖాళీ గ్లాస్ స్టిక్ మిగలగానే ఇది పని చేయటం ఆగిపోతుంది"


చాలా ఆశ్చర్యం, ఆనందం తో పాటు అయోమయం, ఏం చేయాలో తెలియనితనం. నాన్న కి అమ్మ కి చూపిస్తే ఏమంటారో అనేభయం తో నా రూమ్ లోకి పరిగెత్తా.


ఇది నిజమా? ఒకవేళ ప్రయత్నిస్తే ? పని చేయకపోతే ? ఏదైనా ప్రమాదం జరిగితే ? ఏదైతే అదైంది ఇలాంటి పేరెంట్స్ తోఉండటం కన్నా ఇంకేం ప్రమాదం ఉంటుంది అని నా అర చేతిలో చందమామ ని పెట్టుకుని మనసులో అనుకున్నా - నావీడియో గేమ్ నా రూమ్ లో ఉండాలి అని.


కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యం ఎదురుగా టేబుల్ పైన వీడియో గేమ్.

"వావ్. ఎంత ఆనందమో. అసలు ఎలా ఇలా. చందమామా నువ్వు గ్రేట్. ఇది నిజం అయితే నా సైకిల్ కూడా తీసుకురా"

"చందమామా"


గోడకి ఆనుకుని సైకిల్. ఎగిరి గంతేసి, ఆలోచించా - నాన్న కి తెలిస్తే ఎలా అని. ఏదోటి చెప్పాలి అని భయంతో దిండు కిందచందమామ ని దాచిపెట్టి బయటికి వెళ్ళా.


"ఏమ్మా సైకిల్, వీడియో గేమ్స్ నచ్చాయా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనూ మీ అమ్మా నువ్ ఎప్పటి నుండో అడుగుతున్న అవిరెండూ తీసుకొచ్చాం. హ్యాపీ నా ? హ్యాపీ బర్త్ డే నానా " అన్నాడు నాన్న.


వెళ్లి గట్టిగా హత్తుకుని థాంక్స్ చెప్పా అమ్మకి నాన్నకి.


అసలు వాళ్ళే నిజంగా తెచ్చారా లేదా నేను చందమామని కోరుకోవడం వల్ల వచ్చాయా అర్థం కాలేదు. తెలుసుకోవడం ఎలాగోఅర్థం కాలేదు. కాసేపయ్యాక ఐడియా వచ్చింది. కళ్ళు మూసుకుని అర చేతిలో చందమామని పెట్టుకుని - "నిన్నటి వరకూ మాఅమ్మా నాన్న మనసులో ఏముంది నేను అడిగిన గిఫ్ట్స్ కొందాం అనుకున్నారో లేదో ఒక పేపర్ మీద చూపించు చందమామా"


కళ్ళు తెరిచి చూస్తే సగం కరిగిన రెయిన్బో స్టిక్ కలర్స్ చందమామ, పక్కన ఒక తెల్ల కాగితం మీద ఏదో రాసి ఉంది.


"లేదు కవితా, నాకు మాత్రం సైకిల్ కొనాలని ఉండదా చెప్పు. ఒక్కగానొక్క కూతురు, 2 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు బొమ్మస్కూటర్ మీద నుండి పడి తనకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో , కోలుకోవడానికి ఎంత టైం పట్టిందో, మనం పడ్డ బాధ నాకింకాకళ్ళలో తిరుగుతూ ఉంది, చూస్తూ చూస్తూ మళ్ళీ సైకిల్ అంటే అదీ మెయిన్ రోడ్ మీద అంటే , తనకు ఏదైనా అయితే మనంతట్టుకోగలమా ? అలా అని ఆ వీడియో గేమ్ కొందామనుకుంటే తనకు ఇప్పుడే కళ్ళకి 5 నెంబర్ సైట్ ఉంది ఎక్కువ స్క్రీన్ టైంస్పెండ్ చేస్తే కళ్ళకు ఎంత ప్రమాదమో డాక్టర్ చెప్పడం తెలిసిందేగా. వీడియో గేమ్స్ ఉంటే తను స్క్రీన్ ముందు నుండిలేస్తుందా? 

ఏం చేసినా తన కోసమే కదా. నాకు వేరే స్టేట్ లో గొప్ప ఉద్యోగం వచ్చింది వొదులుకున్నా , నీకున్న ఉద్యోగం వొదులుకున్నా అది తనకోసమేగా. తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పేది ?

ఇక్కడి స్నేహాలు ఎలా ఉంటాయో మనకు తెలియనిదా. సురేష్ వాళ్ళ బాబు చెడు స్నేహాల వల్ల ఎలా పాడయ్యాడో, సరిత వాళ్లకూతురు ఇష్టమొచ్చినట్టు డ్రెస్ , జుట్టు వేసుకోమని వాళ్ళ స్కూల్ లో ఎంత బుల్లియింగ్ జరుగుతుందో మనకు చెప్పలేదా. అమ్మానాన్నలకు దూరంగా మనo వచ్చింది, అందరికి దూరంగా తనని పెంచుతున్నది ఇలాంటి వాటి వల్ల చెడిపోవడానికా? తనజీవితం బాగుండాలని మనం ఎంత చేస్తున్నామో తనకు ఎలా తెలిసేది కవితా ?"


అది చదవగానే ఆ వయసులో ఆ ఫీలింగ్ ఏంటో తెలియలేదు గాని ఇప్పుడు తెలుస్తుంది నేనెందుకు స్థంభించిపోయానో. అసలువాళ్ళు ఎందుకు నేను ఏది అడిగినా అంత ఆలోచిస్తారో , నేను అడిగిన ప్రతిదీ ఎందుకు ఒప్పుకోరో అర్థమైంది. చందమామనాకోసం వాళ్ళ మనసు మార్చి ఇవన్నీ కొనేలా చేసింది అని అర్థమైంది. కానీ ఎందుకో ఇదంతా చదివాక సైకిల్ మీద కంటే వాళ్ళమీదే ప్రేమ ఎక్కువ ఉందని నాకర్థమైంది.


ఎంత అసహ్యించుకున్నాను అసలు మా అమ్మా నాన్న ని. నేనేనా ఇలా చేసేది. మా అమ్మ నాన్న లాగే అందరు ఆలోచిస్తారా అనితెలుసుకోవాలి అని అనిపించింది.


"చందమామా - మా కమ్యూనిటీ లో ఉన్న నా అందరు ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటో నాకు తెలిసేలా చేయవా ?"


కళ్ళు తెరిచేసరికి ఒక్కసారిగా వాళ్ళందరి గురించి అంతా తెలిసిన ఫీలింగ్.


"తనకి తల్లి తండ్రీ లేకపోయినా పిల్లల్ని మంచి చదువులు చదివించాలని వేరే దేశం వచ్చి , వాళ్ళే పిల్లలకు తల్లి తండ్రులుగా , నానమ్మ తాతలుగా , మార్గదర్శకులుగా ఉన్న హరీష్ - స్రవంతి వాళ్ళు "


"ఉన్న ఒక్కగానొక్క 2 ఏళ్ళ కొడుకు కి మాటలు రావు, వినిపించవు అని తెలిసినా మనో నిబ్బరం తో ఎప్పటికప్పుడు స్పీచ్ థెరపీట్రీట్మెంట్ తీసుకుంటూ కంటికి రెప్పలా బిడ్డ ను కాపాడుకుంటున్న అజయ్ - గీత వాళ్ళు "


"హై స్కూల్ వయసుకు వచ్చిన కొడుకు చెడు స్నేహాల వల్ల పాడైపోయి చెడు అలవాట్లకు బానిసై జీవితం నాశనం అయిపోతుంటేతన భవిష్యత్తు కోసం ఉన్న ఉద్యోగాన్ని , కలలు కన్న జీవితాన్ని వొదులుకుని భారత దేశం పయనమైన మహేష్ - సంగీత వాళ్ళు "


"కోవిడ్ సమయంలో పిల్లల్ని కని, చేసేవాళ్ళు లేక పెరిగిన లక్ష్మి వాళ్ళ పాప. కోవిడ్ మూలాన ఎవరితో ఆడుకోలేక మాట్లాడలేకవెనకపడిపోయి చివరికి స్కూల్ లో జాయిన్ అయ్యాక అందరితో కలిసే అలవాటు లేక మాట్లాడలేక, చదువులో వెనుకపడిపోవడం చూసి తానే ఒక టీచర్ లా రోజూ పాపని తీర్చిదిద్దుతున్న లక్ష్మి - కళ్యాణ్ వాళ్ళు "



చందమామ ద్వారా ఇవన్నీ తెలిసి ఒక్కసారి ఒళ్ళు జలదరించింది - పిల్లల్ని అర్థం చేస్కునే తల్లి తండ్రులే గాని వాళ్ళని అర్థంచేసుకున్న పిల్లలే లేరా అని. అమ్మ నాన్న గొప్పతనం అర్థమైంది. ఇకపై వాళ్ళ మీద ప్రేమే తప్ప ద్వేషం పెంచుకోవద్దు అని.


ఇంతలో చేయిలో ఉన్న చందమామ గ్లాస్ స్టిక్ భళ్ళున కింద పడింది - నేను గతం నుండి ప్రస్తుతానికి వచ్చా.


ఆ సంవత్సరం నాకు బుద్ధి తెలిసింది అమ్మ నాన్న ల విలువ తెలిసి వచ్చింది. అంత సహాయం చేసిన ఆ చందమామ నాతోఉంటే ఎంత బాగుండు అనుకుంటూ పడుకునే లోపు డింగ్ అని ఒక ఫోన్ మెసేజ్ వచ్చింది.


"హలో నన్ను తల్చుకున్నట్లున్నావ్" అని

"ఎవరు మీరు ? లేదే ఎవర్ని తల్చుకోలేదే "

"మర్చిపోయావా నా అవసరం అయిపోగానే. నేను చందు ని "

"ఏ చందు ? నాకెవరి అవసరం లేదు "

"నీ చిన్నప్పుడు నీకొక మేజిక్ స్టిక్ గిఫ్ట్ ఎవరు పంపారో గుర్తుందా ?"

"వాట్ అది పంపింది నువ్వా ? "

"కాదు. పంపించిందే నన్ను. అయినా అవసరం లేదు అన్నావ్ గా. ఉంటా మరి. వచ్చే బర్త్ డే కి తల్చుకుంటే వస్తా, బాయ్"



అభిప్రాయాలు :


    మరిన్ని...

    మొత్తం - 13
    మరిన్ని...(2)