అర్జున్ రెడ్డి ప్రీక్వెల్
ప్రీక్వెల్
మనకు తెలిసిన, మనకు బాగా నచ్చిన పాపులర్ సినిమాలకు అందులో ఉన్న హీరో కో , హీరోయిన్ కోa ఒక గతం ఉంటే ఎలా ఉంటుంది , ఒకవేళ మనకు తెలిసిన కథ ఇలా కాకుండా మరోలా ఉంటే ఎలా ఉంటుంది, మన సినిమాలకు ఒక సినిమాటిక్. యూనివర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన తట్టి మొదటి ప్రయత్నంగా ఇక్కడ మనకు తెలిసిన అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకి ప్రీక్వెల్ (పార్ట్ 0) రాయడం జరిగింది. ఈ చిన్న ప్రయత్నం మరెన్నో కొత్త కథలకు సోపానం కావాలని ఆశిస్తూ మీ అభిప్రాయం కోసం వేచి చూస్తుంది మీ నిశ్శబ్దం.
...
ఆ ఊర్లో సుదర్శన్ రెడ్డి అంటే ఒక రెబెల్. పంచాయతీ సమితి కింద పని చేసినా ఎన్నడూ ఎవరికీతలొంచింది లేదు, ఎవరికీ భయపడింది లేదు. అది పంచాయితీ అయినా ప్రభుత్వం అయినా. ఊర్లోమనుషులకు కొంచం అన్యాయం జరిగినట్లు అనిపించినా సుదర్శన్ దగ్గరికి వెళ్లడం, గోడు వెళ్లబోసుకోడంసాధారణం అయిపోయింది.
"ఎవడ్రా నువ్వు ?"
"సుదర్శన్ , సుదర్శన్ రెడ్డి. బలిసిందా , పేరు విన్లే ?"
“అయ్యో సారీ సర్ , మీరని తెల్వక మా వాళ్ళు మీ ఏరియా కి వచ్చిన్రు. నేను చెప్తా సర్. మల్ల రారు. ”
“ఇంకోసారి ఇట్లాంటి కథలు పడితే బొక్కలు ఇరుగుతై కొడకా ... చల్ ”
….
“అప్పట్లో మీ తాత సుదర్శన్ రెడ్డి అంటే ఒక హడల్. ఎవ్వడైనా సరే , కొంచం దారి తప్పినా సరే , డుగ్ డుగ్మంటూ ఆ బులెట్ బండి ఏస్కుని వచ్చేటోడు , వాళ్ళ సంగతి చెప్పేటోడు. ”
“తాత రౌడీ నా నానమ్మ ?”
“లేదు రా. పట్వారి సాబ్ . ఊర్లో అన్ని లెక్కలు తాత టిక్ కొడితేనే ముందుకు జరిగేవి . బుల్లెట్ బండి అంటేచాలా ఇష్టం. లేనోళ్లకు సాయం చేయడం ఇష్టం.. డాక్టర్ అయ్యి అందరి ప్రాణాలు కాపాడాలని బాగా కోరికఉండె కానీ కుదర్లే. “
“నేనైత నానమ్మ డాక్టర్. అవునూ తాతకు నీకు ఎట్లా పెళ్లయింది ?”
“తాత వెంట చాలా మంది అమ్మాయిలు వెంట పడుతుండే ఊర్లో. పిల్లని ఇస్తామని రోజు ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ ఏమైందో ఏమో తాత కు ఒక రోజు రేషన్ షాప్ ల నేను కనపడ్డ. అప్పటినుండి తాత మా ఇంటి చుట్టూ తిరుగుడు , పెళ్లి చేసేదాకా మా వాళ్ళను సతాయించుడు.
మా వాళ్లేమో ఈయన కోపానికి మా పిల్లను ఎట్ల ఇస్తం అని లొల్లి. మొత్తానికి చేస్కున్నడు. ఒక్కటే చెప్పిండుమా వాళ్ళతో - నేను సుదర్శన్ రెడ్డి ని , మీ పిల్ల నా ఇంట్ల మంచిగుండకపోతే నా గళ్ళ పట్టుకుని అడగండిఅని"
“మరి తాత కి ఏమైందసలు. నేను పుట్టకముందే ఎందుకు చనిపోయిండు , నా కోసం ఆగలే ?”
“ఎంత మంచిపని చేసినా, ఎంత మంది తో ని పంచాయతీ పెట్టుకున్నా, ఒక్క అలవాటు మాత్రం పోలే. తాగుడు. తాగి తాగి ప్రాణం మీదికి తెచ్చుకున్నడు. ఎందుకు తాగుతావ్ అంటే - ఓహ్ పిల్లా నా మైండ్ పనిచేసే స్పీడ్ కి, నా కోపానికి ఈ మాత్రం తాగకపోతే నేను కంట్రోల్ ల ఉండ. ఎంత తాగుడో ఎప్పుడు ఆపుడో నాకు తెల్సు - అంటుండే. లివర్ పాడై ప్రాణం పోయేదాకా తెచ్చింది. దానికి తోడు ఇంట్లో ఆస్తుల గొడవలు. దగ్గరోళ్లే మాట తప్పి మనసు విరిగేలా చేస్తే బాధ కాదా. చివరి రోజుల్లో చాలా సఫర్ అయ్యిండు”
“మీరందరు ఏం చెయ్యలే మరి ? “
“ఎందుకు చెయ్యలే చేశినం. కానీ suffering is personal let me suffer అని ఇంగ్లీష్ ల చెప్తుండే, బాగ చదుకున్నాడు కదా. వినేదే కాదు ఎంత చెప్పినా ”
“నేను తాత లెక్క నిజాయితీ గా బ్రతుకుతా నానమ్మా, తాత బులెట్ బండి నడుపుతా, నీ లాగ అందమైనఅమ్మాయిని పెళ్లి చేస్కుంటా ధైర్యంగా, తాత కాలేకపోయినా నేను అయితే డాక్టర్ ”
“సర్లే రా అర్జున్ నువ్ నీ లెక్క ఉండు చాలు. మీ తాత కి ఎంత కోపం ఉన్నా, ఎన్ని గొడవలకు పోయినా ఒకఆడ దానికి ఇచ్చే మర్యాద, చిన్న పిల్లల మీద చూపించే ప్రేమ ఏనాడూ తగ్గించుకోలేదు. నువ్వు పెద్దయి ఏంచేసినా సరే గాని ఈ రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకో."
.....
ఆ తరువాత అర్జున్ రెడ్డి ఎలా ఎదిగాడో, కోపానికి ఎలా బలి అయ్యాడో, మరో పక్క నిబద్ధత తో ఎలా బతికినా చివరికి ప్రేమలో పడి, విఫలమయి తనను తాను ఎలా మార్చుకున్నాడో, ప్రీతి ఎలాంటిపరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో మనం అర్జున్ రెడ్డి లో చూడొచ్చు.