భావావేశాలు


Cover Image for భావావేశాలు

"సరే మరి రేపు కలుద్దాం హరీశ్"
"బైబై రాహుల్"

ఆఫీస్ ఫ్రెండ్ హరీశ్ కి బైబై చెప్పి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా.
"హాయ్ సీను, గ్రౌండ్ ఫ్లోర్" లిఫ్ట్ ఓపెన్ అవగానే అక్కడ కూర్చున్న లిఫ్ట్ సెక్యూరిటీ శ్రీనివాస్ కి చెప్పా.

నా పని చేసి, హరీశ్ కి తెలియని పనులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, కొత్తగా జాయిన్ అయిన కావ్య కి ప్రొడక్ట్ డెమో ఇచ్చి, మద్యలో బ్యాంక్ వాడు కాల్ చేసి లోన్ రిజెక్ట్ అయిందని చెప్పడం విని, ఇవన్నీ కలిసి ఈరోజు విపరీతమైన తలనొప్పి, ఒత్తిడి.
"రేపటి వరకూ ఇక పని గురించి ఆలోచన పెట్టుకోవద్దు దేవుడా" అనుకుంటూ లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కోసం వెయిట్ చేస్తున్నా.

"ఏం సంగతులు సీను, ఈమధ్య ఎక్కువ కనవడ్తలేవు, సెలవులు బాగ పెడుతున్నవు. అంత మంచిదేనా?"
"ఏ మాకేం సెలవులు ఉంటాయన్నా, మాదేమన్న పర్మనెంట్ జాబా. ఊళ్లే పని ఉండే, అందుకే ఊకూకే సెలవు అయితుంది. "
"అంత పని ఏం చేస్తున్నారు సార్, బిజినెస్ ఏమన్న పెట్టినవా ఏంది. నీ పనే మంచిగున్నది, మాకు పొద్దుందాక ఇదే పని ఒకటే జీతం. "
"యే లేదు సార్, నా అవసరం ఉంది అక్కడ అందుకే అప్పుడప్పుడు పోవాల్సి వస్తుంది"

శ్రీనివాస్ చాలా సార్లు పనికి మందు కొట్టి రావడం, కొన్ని సార్లు ఆఫీస్ వాళ్ళతో దురుసుగా మాట్లాడడం అనే కంప్లైంట్లు ఉన్నాయి. ఇతనికేం పనుంటుంది, ఇతని అవసరం ఏముంటుంది అని మనసులో అనుకుని "ఏం అవసరం సీను, ఊరిని ఏమన్నా దత్తత తీసుకున్నవా ఏంది. " అని అడిగా.

"అట్లేం లేదు సార్, మా అత్త కూతురు ఇంటికొచ్చింది. ఆమెను దుబాయ్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి అయిన 2 నెలలకే ఆమె భర్త ఒక ఆక్సిడెంట్ లో చనిపోయిండు. మా మామ లేడు, అత్త నేమో బాగ ఏజ్ అయిపోయింది చూస్కొలేదు. నలుగురు పిల్లల పెళ్లి చేసి చాతకాకుండ అయింది.
ఎంతైనా మా పిల్లనే కదా సార్, నేనే చూస్కోవాలి ఇగ.
అందుకే మద్య మద్య ల ఊరికి పోయి చూసుకోవాలి. ఆమెను ఓదార్చదానికి, ఆమెకు ఏమన్న పని ఉంటే ఇప్పియ్యడానికి, పైసలు ఇయ్యడానికి ఊరికి పోవాలె. నా పైసలు అందరికి సాల్తలేవని, ఈ మద్య మా ఆవిడని కూడా పనికి పొమ్మన్న. ఆ పిల్లకు ఏదన్నా మంచి భవిష్యత్ ఇవ్వాలి సార్. ఇవన్ని చూస్కోవాలి అంటే పోవాలి, సెలవు పెట్టాలి కదా సార్. "

నేను కొంచెం ఆశ్చర్యం, కన్ఫ్యూజన్ లో ఏదో రెస్పాండ్ అవ్వబోయి చెప్పేలోపు "గ్రౌండ్ ఫ్లోర్" లిఫ్ట్ వాయిస్ మోగింది.

తన భుజం తట్టి , "మంచి పని, కలుస్తా మరి" అని చెప్పి బైటికి వచ్చా.

శ్రీనివాస్ చూస్తున్నంత బాధ్యత లేని మనిషి కాదేమో అనుకుని అప్పటిదాకా తన పైన ఉన్న నా భావాలు తప్పు అని తెలుసుకుని ఇంటికి బయలుదేరా.

. . .
కాసేపు టీవీ చుద్దాం అని ఆన్ చేసా. ఈ రొటీన్ ఛానెల్స్ నాకు అలవాటు లేదు. న్యూస్ ఛానెల్స్ చూస్తే -
"మ్యాన్ హోల్ లో చిక్కుకున్న బాలుడు, 12 గంటలైనా స్పందించని మునిసిపాలిటీ - ఈ సమాజంలో ప్రశాంతంగా బతికే హక్కు లేదు కనీసం నడిచే వీలు కూడా లేదా మనిషికి?"
ఛానెల్ చేంజ్ -

"అసలు పొద్దున నుండి రాత్రి వరకు గుండ్రంగా తిరుగుతూనే ఉండే భూమికే దిక్కులు ఒక వైపు ఉండవు సాయంత్రం వరకు, దానిపై ఉంటున్న మనకు దిక్కులేంటి, వాటికి ప్రాధాన్యత ఇచ్చే వాస్తు ఏంటి"
ఛానెల్ చేంజ్ -

"రాత్రి పూట వజ్రాసనం వేస్తే కాళ్ల లో రక్త సరఫరా బాగా జరిగి కాళ్ళు రిలాక్స్ అవడం వలన మంచి నిద్ర రావడం జరుగుతుంది"
ఛానెల్ చేంజ్ -

"మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల మన స్పందన లేక ప్రతిచర్య లో ఏర్పడే కోపం, ఆనందం, ప్రేమ, ఉత్సుకత, విచారం, కుంగుబాటు, శాంతము లాంటి అనేక భావనలను ఉద్వేగం అంటాము.
పచ్చని అడవిని చూసినప్పుడు కలిగే ఉత్సుకత,
చెట్టుపై కూచున్న పక్షుల సవ్వడి కలిగించే ప్రేమ భావము,
పొంగే అలలు చూసి వచ్చే ప్రశాంతం,
పసిపిల్లల చిరునవ్వు కలిగించే ఆహ్లాదం,
ఒక ఇంద్రధనుస్సు ను చూస్తే వచ్చే ఆనందము, అది పోయాక వచ్చే నిరాశా,
ఇలా అన్ని కలిసి భావావేశాలు, భావోద్వేగ ప్రతిస్పందనలు కలిస్తేనే మన మనసు.

మన ఆలోచనలు, భావనలు, భావావేశాలు అన్నీ అర్థం చేసుకుని, గమనిస్తూ ముందుకు సాగడమే మనసు పని. అప్పుడప్పుడూ భావావేశాలలో ఉన్న ఫలంగా మార్పులు రావడం సహజం..."
ఛానెల్ చేంజ్,
ఈ సైకాలజీ డాక్టర్లు చాలా చెప్తారు చెప్పమంటే అనుకుని.

ఎందుకో అర్ధ గంట సేపు టీవీ ముందు కూచున్నా ఈ తల నొప్పి తగ్గట్లేదు, ఈ లోన్ రిజెక్ట్, ఆఫీస్ టెన్షన్లు, ఇంట్లో వాళ్ళ పెళ్లి లొల్లి, ఒంటరితనం అన్నీ కలిసి అంత ప్రశాంతంగా అనిపించలేదు. కాసేపు అలా బైటికి వెళదామని నడుచుకుంటూ బయలుదేరాను.

కొద్ది దూరం వెళ్ళగానే ఒక టీ కొట్టు దగ్గర ఆగి, ఒక టీ చెప్పి అలా టీ కోసం ఎదురచూడసాగాను. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి, 40 యేళ్లుంటాయేమో, మరో ఇద్దరు చిన్న పిల్లలతో, బైక్ మీద వచ్చి దిగాడు. టీ చెప్పి పక్కన ఉన్న బెంచి పైన కూచున్నాడు.

నా టీ అప్పుడే వచ్చింది. మామూలుగా ఆ చుట్టుపక్కల చాలా ట్రాఫిక్ ఉంటుంది కానీ ఈరోజు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది నాకోసమే అన్నట్టు. అలా టీని ఆస్వాదిస్తూ ఆలోచనల్లోకి వెళ్ళసాగాను.

ఇంతలో అక్కడున్న పిల్లలిద్దరూ మెల్లిగా అరవడం, అల్లరి చేయడం తో అక్కడ పక్కన ఉన్నవాళ్లు కూడా ఇబ్బందిగా ఫీల్ అవడం గమనించా. ఏదో కాసేపు ప్రశాంతంగా ఉందాం అని వస్తే ఈ గోల ఏంటి అసలు అనుకుని కొంచం సహించా. కానీ ఆ వ్యక్తి కి మాత్రం ఏం పట్టనట్టు ఉంది. అలా టీ తాగుతూ ఏదో ఆలోచనల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ఆ పిల్లల అల్లరి మాత్రం అలా పెరుగుతూనే ఉంది. ఉన్న కొద్ది మంది కూడా అది భరించలేక అక్కడినుండి వెళ్ళడం గమనించా. ఇక నా వల్ల కూడా కాదు ఇంత అల్లరి అని నేనూ పలాయనం చిత్తగించా.

పక్కనే ఒక పార్క్ ఏదో ఉంటే కాసేపు కూర్చుంటా అని వెళ్లా. అక్కడ ఏదో మేజిక్ లాగా అనిపించింది, ఒక రకమైన ప్రశాంత వాతావరణం, చల్ల గాలి, స్థిరమైన కొలను అన్నీ అదొక రకమైన అనుభూతినిచ్చాయి.
ధ్యానం చేసుకోవాలనే విధంగా నన్ను ఆ ప్రకృతి రెచ్చగొట్టడం జరిగింది. అలా ఒక కొత్త ప్రపంచంలోకి మెల్లిగా వెళ్తున్న తరుణంలో ఆ ఫలానా వ్యక్తి, ఆ పిల్ల రాక్షసులు అక్కడికీ రావడం జరిగింది.

నెమ్మదిగా వాళ్ళ రణగొణ ధ్వనులు నాలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని వాకిలి పై నీటితో కొట్టినట్టు తుడిచెయ్యడం, నన్ను ఎక్కడ లేని అవస్థకు గురి చేయడం గమనించా.

ఇంత జరుగుతున్నా ఆ సదరు వ్యక్తి ఏమీ జరగలేదు అన్న చందాన అలా కూర్చుని ఉండడం నన్నింకా రక్తపోటు ఉన్న వ్యక్తిగా మార్చింది. ఇక ఉండబట్టలేక తన దగ్గరికెళ్ళి కడిగేసా - "ఏమయ్యా పెద్దమనిషి, నీకేమన్నా మతి తప్పిందా లేక చెవులు ఏమన్నా పని చేయడం లేదా. ఇందాకటి నుండి చూస్తున్నా, ఈ పిల్ల రాక్షసులు నానా రభస చేస్తుంటే, అక్కడ ఉండలేక అందరూ వెళ్లిపోతుంటే అన్నీ చూస్తూ కూడా ఒక్క మాట అనట్లేదు, వాళ్ళని కనీసం వారించనైనా లేదు. ఏం మనిషవయ్యా, నువ్వు ప్రశాంతంగా ఉంటే సరిపోతుందా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేది లేదా?"
అని నా నోటి దురద అంతా తీర్చుకున్నా.

ఒక రెండు సెకండ్లు ఆలోచించిన తరవాత ఆ వ్యక్తి అన్నాడు - "అయ్యో క్షమించండి, మీ అందరికీ ఇంత ఇబ్బంది అవుతున్న విషయమే గమనించలేదు. పిల్లలు కదా అల్లరి సాధారణమే అని పెద్దగా పట్టించుకోలేదు. ఏదో నా లోకం లో ఉండిపోయా. నిజానికి జరిగింది ఏంటి అంటే, పక్కనే ఉన్న మిషన్ హాస్పిటల్ లో వాళ్ళ అమ్మ కి పెద్ద ఆపరేషన్ జరిగింది, కానీ అది వికటించి తను ఒక గంట కిందటే చనిపోయింది. వాళ్ళ నాన్న కూడా ఒక హృద్రోగి. తను కన్నీరు మున్నీరై ఏడుస్తుంటే ఈ పిల్లలకి ఏం జరిగిందో అర్థం కాక చాలా అల్లరి చేస్తున్నారు. జీవితాంతం పక్కనే ఉంటుంది అనుకున్న భార్య అలా వెళ్లిపోయేసరికి తట్టుకోలేక తనుంటే ఈ పిల్లలను కూడా చూసుకోవడం అనే పని ఎందుకు అని నేనే బైటికి తీస్కొచ్చా కాసేపు. కానీ ఇక్కడ ఇలా మీకు ఇబ్బంది అవుతుంది అని అనుకోలేదు, క్షమించండి. నేనూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయి చూస్కోలేదు. వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందో తెలియట్లేదు, కానీ అంత త్వరగా నేను తేరుకోవడానికి చనిపోయింది ఎవరో దూరం మనిషి కాదు, నా సొంత చెల్లెలే. "
అని చెప్పి లేచి దండం పెట్టి పిల్లల్ని తీసుకుని అక్కడినుండి వెళ్ళిపోయాడు.

స్తబ్దుగా ఉండిపోవడం నా పనైంది.

ఒక్క నిమిషంలో ఎంత మార్పు నా ఆలోచనల్లో, అప్పటిదాకా ఉన్న కోపం, కసి అంతా ఒక రకమైన బాధ, జాలి గా మారడం గమనించా. అప్పుడు ఆ శ్రీనివాస్ సంఘటన, ఇప్పుడు ఇది. నా ఫీలింగ్స్ ఏంటి ఇలా మారుతున్నాయి.

సైకాలజిస్ట్లు ఊరికే ఏదీ చెప్పరు అనిపించింది. శ్వాస మీద ధ్యాస మాత్రమే కాదు,
భావావేశాల పైన కూడా కొంచం ధ్యాస పెట్టడం మర్చిపోవద్దు అనుకుని తిరుగు పయనం. 🙏🙏

అభిప్రాయాలు :


  • అవినాష్ అడ్లూరి ()

    థాంక్స్ శ్రీ వర్ష 😊



  • Sreevarsha Bhattraju ()

    Very absorbing and thoughtful.. we are drenched in our emotions often forgetting that society is our extended family.. Good one Avinash..👏



  • అవినాష్ అడ్లూరి ()

    Yes u can naresh



  • NARESH KUMAR ()

    Hi Can I print u r stories in Paper ? Thank you. ----------------- Naresh 7780590895



  • అవినాష్ అడ్లూరి ()

    పావని గారు ధన్యవాదాలు అండి. కథలో ఉన్న సాంద్రతను గుర్తించినందుకు🙏🏻



  • Pavani Gandra ()

    చాల బావుంది. మంచి కథ. ఆ పిల్లల మామయ్య అంత భాధలో కూడా స్పందించిన తీరు ఎంతటి కఠినులనైన ఆలోచింప చేసేలా వుంది. మన ఒక్కరం కాదు అందరిలో ఒక్కరం అని గుర్తు చేస్తుంది మీ కథ.



మరిన్ని...

మొత్తం - 13
మరిన్ని...(2)