భరత్ అనే నేను


Cover Image for భరత్ అనే నేను
నాయ‌కులు లేని సమాజాన్ని రూపొందించ‌డ‌మే ఉత్త‌మ నాయ‌కుడి ల‌క్ష‌ణం అనే అంశాన్ని, ఇచ్చిన మాట మీద నిల‌బ‌డాల‌నే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ ఇది.

కేవలం సందేశాలిస్తే చూడటానికి జనాలు సిద్ధంగా ఉండరు.

తాము చెప్పాలనుకున్న మంచిని వినోదం పూత పూసి చెప్పి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులువైన విషయం కాదు. నిజంగా అలా చెప్పగలిగితే ప్రేక్షకులు ఆ సినిమాపై అమితమైన ప్రేమను చూపిస్తారు. మూడే మూడు సినిమాల అనుభవంతోనే టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా కొరటాల శివ పేరు తెచ్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకోవడమే కారణం.

ఒక కథ ఎంత ఎక్కువమంది జనాలకు కనెక్టయితే.. అది అంత పెద్ద విజయం సాధిస్తుంది. ఆ కథలోని పాత్రలతో.. అంశాలతో ఐడెంటిఫై కాగలగడం అనేది కీలకమైన విషయం.

ఇష్టమున్నా లేకపోయినా రాజకీయాలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. కానీ ఆ నేపథ్యంలో పకడ్బందీ సినిమాలు తెలుగులో చాలా తక్కువ అనే చెప్పాలి. ఐతే కొరటాల శివ మాత్రం వర్తమాన రాజకీయ.. సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఒక బలమైన సినిమానే అందించాడు. సమకాలీన పరిస్థితులపై అవగాహన ఉండటం వేరు. ఆ పరిస్థితుల్ని తెరమీద ఆసక్తికరంగా చూపించడం వేరు.

సినిమాలో చూసేవన్నీ తెలిసిన విషయాలే.. కథాకథనాలు.. సన్నివేశాల్లో మరీ కొత్తదనం ఏమీ కనిపించదు. అయినప్పటికీ దాదాపు మూడు గంటల పాటు చాలా వరకు ఆసక్తి సన్నగిల్లకుండా తన మార్కు ‘సింప్లిసిటీ’తో సినిమాను నడిపించడంలో.. ప్రేక్షకుల్ని అలరించడంలో కొరటాల విజయవంతమయ్యాడు.చాలా చోట్ల ‘లీడర్’ను తలపించే ‘భరత్ అనే నేను’ కథ.. అందులో మాదిరే చాలా వరకు రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది.

చాలా కొద్దిమంది దర్శకులు మాత్రం సినిమాకు సామాజిక బాధ్యత కూడా ఉందని భావిస్తారు. జవాబుదారీతనం, స్వయం పరిపాలన , విద్యా వ్యవస్థ ప్రక్షాళన, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక వ్యవసాయ విభాగం , అందుబాటులోకి ఆరోగ్య వ్యవస్థ , కఠిన ట్రాఫిక్ నియమాలు ….ఒక స్టార్ సినిమాలో ఇలాంటి పనికొచ్చే , అవసరమైన, కామన్ విషయాలు దర్శకుడు ఆలోచించాడంటే గొప్ప విషయమే …

ఈ మధ్య కాలంలో మీడియా కూడా కొన్ని విషయాలను మరింత సాగదీసి కావాలని టీఆర్పీ రేటింగులు పెంచుకోవడం కోసం బలవంతంగా తన వ్యూని ప్రజలపై రుద్దుతున్నారు. అలాంటివారిని టార్గెట్ చేస్తూ కొరటాల బలమైన సన్నివేశాలనే రాసుకున్నాడు.మీడియా అంటేనే విసుగు వచ్చే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాలో మీడియా మీద పంచ్ బాగుంది. ఇలాంటివి మీడియా మీద ఏ మాత్రం ప్రభావం చూపకపోయినా, చూసేవాళ్ళ మీద అయినా ఉంటుంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా వాళ్ళ మీద

రాజకీయాలంటే ఏంటో కూడా తెలియని ఒక యువకుడు ఎనిమిది నెలల్లోనే ఎన్నో సేవలు చేస్తే.. రాజకీయంగా ఎంతో పండిపోయి ఉన్న మన నేతలు ప్రజలకు ఇంకెంత మంచి చేయొచ్చనే ఆలోచనను రేకెత్తించాడు.

ప్రస్తుత రాజకీయాల్ని ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించాడు కొరటాల శివ. ఇటు ప్రజలు, అటు రాజకీయ నాయకులు, మధ్యలో మీడియా ఇలా వ్యవస్థంతా ఎలా పాడైపోయిందో, ఎందుకు ప్రజలు ఇంకా అభివృద్ధి బాటలో వెళ్లలేకపోతున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. పొలిటికల్ మూవీ అనగానే ఊకదంపుడు లెక్చర్లు ఉంటాయని భయపడతాం. కానీ అలాంటిదేమీ లేదు. డైలాగ్స్ పెర్ఫెక్ట్ గా కుదిరాయి.

అయితే, పొలిటికల్ జానర్ సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట డౌన్ కావాల్సిందే. అందుకు భరత్ అనే నేను కూడా మినహాయింపు కాదు. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నాయి. అయితే వాటిని మినహాయిస్తే, సినిమా చాలా బాగా తెరకెక్కించాడనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో అత్యంత రిచ్ నెస్ ఉన్న సినిమాగా భరత్ అనే నేను గురించి చెప్పుకోవాలి.

నాకు నచ్చిన కొన్ని విషయాలు :

  • జవాబుదారీతనం, స్వయం పరిపాలన , విద్యా వ్యవస్థ ప్రక్షాళన. అసలు భారత దేశం లో విద్య ను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడం నేరం అనే విషయం ఒకటుందని తెలిసింది .
  • ప్రతి రైతు కి అండగా తోడు గా ఉండే ఒక పరిపాలనా విభాగం ఉండడం .
  • మీడియా ని ఏకి పారేయటం :)
  • కుళ్ళు జోకులు , అనవసర రొమాన్స్ లు , అతి డైలాగ్ లు లేకపోటం .

ఇది నా అభిప్రాయం మాత్రమే …

అభిప్రాయాలు :


    మరిన్ని...

    మొత్తం - 13
    మరిన్ని...(2)