తికమక
ఆటా ఇటా...
అదా ఇదా...
ఈ రైలు ఎక్కాల్నా ఆగల్నా....
అచ్చ్చే రైలు ఖాలిగుంటదిలే...
సచ్చిన పో, ఇంతకు ముందు రైలు ఎక్కినా అయిపోయేదే...
ఈడ నిలవడేదేదో రైళ్లనే నిలవడ్తుండే...
పోనితియ్ ఇంకోటి సూద్దం....
మొన్న జిమ్ ల జాయిన్ అయితే అయిపోయేది,
అయినా పొద్దున ఐదిటికి ఎవ్వడు లేత్తడు తియ్యి...
వినయ్ గాన్ని ఆ మాట అనెడిది లేకుండె,
అయినా ఆ మాత్రం అనకపోతే నన్నెక్కడ దేకుతడు వాడు...
అసలు ఈ కంప్యూటర్ చదువు చేసేదే లేకుండె,
ఈ సాఫ్ట్వేర్ పని నాతోనే కాదసలు,
ఇది చేసేపటికనే ఈ మాత్రం పని దొరికే,
లేకపోతే నాకెవలిత్తరు జాబు...
అసలీ ఆస్ట్రేలియా కి ఎందుకొచ్చిన తిప్పలు పడ్కుంట,
ఆన్నే ఉంటె అందర్తో మంచిగుంటుండే,
ఐనా ఆడేమున్నదని ,
అమ్మ నాన్నా పోయినంక ఎవలుంటరని...
గిన్ని పైసల్ సంపాదిస్తున్న కొంచం లేనొల్లకు సాయం చేస్తే ఏoది...
నేనొక్కడ్నే పంపంగనే అందరి జీవితాలు మంచిగ ఐతయ ఏoది...
....
మల్టిపుల్ ఆన్సర్స్ లెక్క అన్ని తికమకలకు ఒక ఎస్సు ఒక నో ఉంటె ఐపోవు, ఎక్కువ అలోచించకుండ ఉండేది.
జీవితానికి అచ్చేసరికి అట్ల కాదే.
చేస్తే ఓ బాధ, చేయకపోతే ఒక బాధ.
అప్పటికప్పుడు అదే కరెక్ట్ అన్పిస్తది,
కొంచం అయినంక ఇంకేదో కరెక్ట్ అన్పిస్తది.
...
మైండ్ ల ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటరు.
వీడు ఇది రైట్ అంటడు
ఆడు అది రైట్ అంటడు
ఇద్దరు మనోళ్లే, ఏంజెప్పాలే
సరే అంత అయినంక నేను చెప్తా అనుకుంటే నా మాట వినేది ఎవడు, అసలు నాకేం తెలుసు ఎవడు రైటో...
....
ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోయామే,
తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోయామే,
తీసుకున్నది సరైనదే అని ఇప్పటికీ అనుకొలేకపోతున్నమే...
ఈ బాధా, న్యూనతా, ఘర్షణా మనల్ని స్థిరంగా, శాంతి గా ఉండనియ్యవు...
ఓరి దేవుడా,
ఒక స్పష్టత,
కుండ బద్దలు కొట్టిన స్పష్టత,
అది ఇవ్వాళ్ళ తెల్ల షర్ట్ వేస్కోవాలా, కలర్ షర్ట్ వెస్కోవాలా అన్న చిన్న విషయమైనా సరే,
ఒక స్పష్టత ఇయ్యరాదే..
అయినా దేవుడున్నాడా అసలు, ఉంటే ఎక్కడున్నాడు...
మల్ల ఇదొక లొల్లి నాకున్నై సాలవన్నట్టు
....
అన్ని మన చుట్టూనే ఉంటాయి,
అయినా ఆ గ్రహింపు కలగడానికి కావాల్సింది ఏదో మిస్సవ్వుతూ ఉంటుంది.
బహుశా ఆ లింక్ కనుక్కోవటమే ‘సత్యం‘ ఏమో...
వామ్మో ఇవన్ని ఆలోచనలతో అవసరమా ఇంట్లో అని అలా ఇంటి వెనకకి వెళితే అస్సలు గాలి రావట్లేదు అని అలా పక్కన పార్క్ కి వెళితే అక్కడ గాలే గాలి.
ఓర్ని ఆఫ్టరాల్ ప్రకృతి లోనే ఇన్ని ఎక్స్ట్రీమ్ షేడ్స్ ఉన్నప్పుడు దాన్లో నుంచి వచ్చిన నాలో ఎన్ని ఉండొచ్చు?
నీ యవ్వ తగ్గేదేలే అని అనుకుంటూ ఇంటికి వెళ్లా ఏదో సాధించినట్టు జేబులో చేతులు పెట్టుకుని...!!